eenadu.net

జనం గుండెల్లో కొలువై...

  • ️Eenadu

జనం గుండెల్లో కొలువై...

పదవి వ్యక్తికి అలంకారం కారాదు. వ్యక్తి తన ప్రవర్తనతో అపదవికే వన్నె తేవాలి’ అన్న మాటను నూరుశాతం ఆచరణలో పెట్టారు ఆయన. సజీవంగా లేకపోయినా జనం గుండెల్లో జీవించే ఉన్నారు విల్లూరి వెంకట రమణ.

Eenadu icon

By Andhra Pradesh Dist. Team Published : 25 Jun 2023 05:43 IST

నేడు వీవీ రమణ శత జయంతి ఉత్సవాలు
ముఖ్యఅతిథిగా వెంకయ్యనాయుడు రాక

గవరపాలెంలో ఏర్పాటు చేసిన వీవీ రమణ విగ్రహం

అనకాపల్లి, న్యూస్‌టుడే : ‘పదవి వ్యక్తికి అలంకారం కారాదు. వ్యక్తి తన ప్రవర్తనతో అపదవికే వన్నె తేవాలి’ అన్న మాటను నూరుశాతం ఆచరణలో పెట్టారు ఆయన. సజీవంగా లేకపోయినా జనం గుండెల్లో జీవించే ఉన్నారు విల్లూరి వెంకట రమణ. ఆయనకు రైతులు గుడి కట్టి మరీ గుండెల్లో పెట్టుకున్నారు. శతజయంతి ఉత్సవాలను ఆదివారం పట్టణంలో అనకాపల్లి వ్యవసాయదార్ల సంఘం, వీవీ రమణ ట్రస్టు భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. సాయంత్రం నిర్వహించే సభలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో పాటు పలువురు పాల్గొంటున్నారు.

రైతు సమస్యలపై వీవీ రమణ చూపే చొరవే రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యేలా చేసింది. కేవలం 31 ఏళ్లకే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి వంటి ఎందరో నేతలతో పనిచేసిన అనుభవం ఆయనది. ఎన్జీ రంగా, గౌతు లచ్చన్నలకు ప్రియ శిష్యునిగా వ్యవహరించారు. అప్పట్లో కాంగ్రెసు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేవారు. రైతుల కోసం తన సొంత డబ్బునే ఖర్చు చేసేవారు. కృషికార్‌లోక్‌, స్వతంత్ర పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. చివరివరకు తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారు.  దేశంలోనే తొలిసారిగా రైతులతో కలిసి ప్రత్యేకంగా రైలు యాత్ర నిర్వహించారు. దిల్లీలో రాష్ట్రపతితో రైతులతో మాట్లాడించారు. తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని అప్పటి యాజమాన్యం అమ్మకానికి పెడితే రైతుల నుంచి  రూ.27 లక్షలు వసూలు చేసి కొనుగోలు చేసి సహకార రంగంలో నడిపారు. అందుకే ఆ కర్మాగారానికి ఆయన పేరే పెట్టారు. పట్టణంలోని గౌరీ ప్రాథమిక సహకార సంఘానికి, అనకాపల్లి వ్యవసాయదారుల సంఘానికి ఆయన పేరు పెట్టి తమకున్న గౌరవాన్ని రైతులు చాటుకున్నారు. గవరపాలెంలో ప్రత్యేకంగా గుడికట్టి పూజలు చేస్తారు. సంక్రాంతికి ప్రత్యేకంగా జాతర నిర్వహిస్తారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.